గోదావరి పుష్కరాల లోగోకు రూ.1 లక్ష బహుమతిః మంత్రి పొన్నం పిలుపు
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పుష్కరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు కళాకారులు, సృజనాత్మకత కలిగిన ఔత్సాహికుల ప్రతిభను ప్రోత్సహించేందుకు లోగో, ట్యాగ్‌లైన్ రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోటీలపై సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల ప్రచారానికి ఆకర్షణీయమైన లోగో, అర్థవంతమైన ట్యాగ్‌లైన్ రూపొందించి పంపించాలని ఔత్సాహికులకు పిలుపునిచ్చారు. ఉత్తమంగా ఎంపికైన మూడు డిజైన్లకు వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఎంట్రీలు స్వీకరిస్తున్నామని, ఆసక్తి ఉన్నవారు తమ లోగో, ట్యాగ్‌లైన్‌లను కలిపి ఈ-మెయిల్ చిరునామాకు నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపించాలని సూచించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26న ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి పేర్కొన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు అవసరమైన రవాణా సౌకర్యాలు, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఉత్తర భారతదేశంలో నిర్వహించే కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను తెలంగాణలో అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకలో తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.