సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి
సూర్య నస్పూర్ : సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్కే న్యూటెక్ గని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ మినహా మిగతా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కస్తూరి చంద్రశేఖర్, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి వెంగళ కుమారస్వామి మాట్లాడుతూ, 2023లో ఎన్నికలకు ముందు ఆర్‌ఎల్‌సీ, సీల్‌సీ వద్ద జరిగిన ఒప్పందం ప్రకారం సింగరేణిలో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా రెండేళ్ల కాలపరిమితికి ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కాలపరిమితి ముగిసినందున అన్ని ట్రేడ్ యూనియన్లకు సింగరేణి అధికారిక కార్యక్రమాలతో పాటు మైన్స్ ఫిట్ కమిటీలు, సేఫ్టీ కమిటీలు, టెంపుల్ కమిటీల్లో సమాన హోదా, ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ సిరిగిరి తిరుపతి, సీఐటీయూ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ అరిగె సందీప్ కుమార్, టీబీజీకేఎస్ షిఫ్ట్ ఇన్‌చార్జి భాస్కర్, హెచ్‌ఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు సురేందర్, బీఎంఎస్ ఫిట్ సెక్రటరీ రాజేష్, దీపక్, శ్యామ్, ఉప్పల సంపత్, సందీప్ గౌడ్, లింగమూర్తి, ఇజ్జగిరి ప్రతాప్, గట్టు రాజు, రాజ్‌కుమార్, శంకర్ నాయక్, గుండు రాజు తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.