కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం.
కళ్యాణదుర్గం: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని టీ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి కార్మికుల హక్కుల పరిరక్షణకు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పెరుగుతున్న పనిభారం, కనీస వేతనాల అమలులో నిర్లక్ష్యం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి, గతంలో అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి చట్టబద్ధంగా కనీస వేతనం అందించాలని, పదవీ విరమణ అనంతరం అవసరమైన ప్రయోజనాలు కల్పించాలని, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఆటో కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పాతక్క, నాయకులు తులసి, లక్ష్మి, పద్మ, అలివేలమ్మ, తిమ్మప్ప, రమణ, వన్నూరుస్వామి తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.