శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు
కొమరోలు, మేజర్‌న్యూస్ :
కొమరోలు మండలం గోపాలుని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడం, దైవదర్శనం చేసుకోవడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. పలు ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తుల రాకతో ఆలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.