ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను పత్తికొండ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మోహన్ విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి (ఏవో) ఆర్. అక్బర్ భాష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాకు రిజిస్టర్లు, స్టాకు బోర్డులు, లైసెన్స్‌లు, అనుమతి పత్రాలు, ఇన్‌వాయిస్‌లతో పాటు గోడౌన్లలో ఉన్న ఎరువుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నాణ్యత పరీక్షల నిమిత్తం నాలుగు రకాల ఎరువుల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు.ఈ సందర్భంగా డీలర్లకు అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:
ఎరువుల డీలర్లు ప్రతిరోజూ స్టాకు రిజిస్టర్లు, స్టాకు బోర్డులను తప్పనిసరిగా నమోదు చేయాలి.
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఎరువులు, బయో స్టిములెంట్లను మాత్రమే విక్రయించాలి.
యూరియా, డీఏపీ ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, వీటితో పాటు ఇతర ఎరువులను (లింక్ పెట్టడం) అంటగట్టకూడదని కఠినంగా హెచ్చరించారు.
అన్ని రకాల ఎరువులను ఆధార్ లేదా రైతు ఐడీ అనుసంధానంతో ఎఫ్‌ఎఫ్‌ఎస్ (FFS) యాప్ ద్వారా క్యూఆర్ (QR) కోడ్ విధానంలో మాత్రమే రైతులకు విక్రయించాలని స్పష్టం చేశారు.