ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి
- ఎమ్మెల్యే శిరీష
రoపచోడవరం, సూర్య ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని రoపచోడవరం శాసనసభ్యురాలు, రాష్ట్ర శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి మాట్లాడారు.తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మూడు పార్టీల మధ్య ఉన్న సమన్వయం, ఐక్యత గ్రామస్థాయి వరకు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడంతో పాటు, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సమాన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పి 4 విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు.
సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని, సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేసే ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా గ్రామస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగంగా చేరుతాయని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలి. గ్రామాల్లో పారదర్శక పాలన, జవాబుదారీతనం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జరగని అభివృద్ధిని తిరిగి వేగవంతం చేయడం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఎన్డీయే కూటమి లక్ష్యమని తెలిపారు.అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే కూటమి బలోపేతం కావాలి. గ్రామాల అభ్యున్నతి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన కోసం రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు.