అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత
వరంగల్ సిటీ, మేజర్ న్యూస్ ,అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బాధితుల బాండ్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ సోమవారం వెల్లడించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల బాధితుల కోసం వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాల్‌లో ప్రత్యేక కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు.ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన జరుగుతుందని సీపీ స్పష్టం చేశారు. కేంద్రం వద్ద రద్దీని నివారించేందుకు మండలాల వారీగా తేదీలను కేటాయించామని, బాధితులు తమ మండలానికి నిర్దేశించిన తేదీల్లోనే హాజరుకావాలని సూచించారు. సీఐడీ మార్గదర్శకాల ప్రకారం ఐదు కేటగిరీలకు చెందిన వారందరూ ఒరిజినల్ బాండ్‌తో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటో, పాన్ కార్డు, సెల్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్, తెలిసి ఉంటే ఏజెంట్ ఫోన్ నంబర్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. సందేహాల నివృత్తి కోసం ఇన్‌స్పెక్టర్ ఇ.హరికృష్ణ (87126-85137)ను సంప్రదించవచ్చని సీపీ పేర్కొన్నారు.
కేటగిరీల వారీగా వెంట తెచ్చుకోవాల్సిన పత్రాలు...
డిపాజిటర్ జీవించి ఉంటే ఒరిజినల్ బాండ్, ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్, ఖాతాదారుడి పేరు, అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్పష్టంగా ఉన్న బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్,
డిపాజిటర్ మరణించి, నామినీ జీవించి ఉంటే నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్), నామినీ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు, రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్.
నామినీ బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణించి ఉంటే అసలు బాండ్, చట్టబద్ధ వారసుడు, కుటుంబ సభ్యుడు సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్ , డిపాజిటర్, నామినీ ఇద్దరి మరణ ధ్రువీకరణ పత్రాలు, వారసుడి ఆధార్, పాన్ కార్డులు, రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్. (వీటన్నింటి ఒరిజినల్స్ కూడా తప్పనిసరిగా చూపించాలి), డిపాజిటర్ జీవించి ఉండి, కేంద్రానికి రాలేకపోతే డిపాజిటర్ అసలు బాండ్, సంతకం చేసిన కలర్ జిరాక్స్, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫొటో జిరాక్స్‌లతో పాటు ఒరిజినల్స్ చూపించాలన్నారు.
కేంద్రానికి వచ్చే కుటుంబ సభ్యుడి ఆధార్, గుర్తింపు కార్డు, సంబంధాన్ని నిరూపించే రేషన్ కార్డు లేదా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్,డిపాజిటర్ నుంచి అధికారిక అనుమతి పత్రం (ఆథరైజేషన్ లెటర్) తప్పనిసరి అన్నారు.ప్రతి బాండ్ ఒరిజినల్ పేపర్, కలర్ జిరాక్స్ సమర్పిస్తూ ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలి. ఏజెంట్ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, ఏజెంట్ పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా నమోదు చేయాలని సిపి తెలిపారు
రిపోర్టర్: సంతోష్, వరంగల్ సిటీ ,వరంగల్ జిల్లా