గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం
హనుమకొండ టౌన్, మేజర్ న్యూస్, గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లో అరుదైన, పవిత్రమైన బ్రహ్మ కమలం వికసించింది. స్థానికంగా నివాసముంటున్న కందుల ఎల్లయ్య - ఎలేంద్ర దంపతుల నివాసంలో పెంచుతున్న మొక్కకు సోమవారం రాత్రి ఈ పుష్పం విరబూసింది.
సాధారణంగా రాత్రి వేళల్లో మాత్రమే వికసించే ఈ అద్భుత పుష్పాన్ని చూసేందుకు కాలనీవాసులు, చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా తరలివచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూస్తుందని భావించే ఈ పుష్పం తమ ఇంట వికసించడం పట్ల ఎల్లయ్య దంపతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతిలో అత్యంత అరుదుగా వికసించే పుష్పంగా దీనికి పేరుంది. కేవలం రాత్రి సమయంలోనే విచ్చుకుని, తెల్లవారుజామున తిరిగి ముడుచుకుపోవడం దీని ప్రత్యేకత.
హిందూ సంప్రదాయంలో బ్రహ్మ కమలాన్ని అత్యంత పవిత్రమైనదిగా, శుభప్రదంగా, అదృష్టానికి మరియు ఐశ్వర్యానికి సంకేతంగా భక్తులు విశ్వసిస్తారు.
రిపోర్టర్; రమేష్ ,హనుమకొండ టౌన్, హన్మకొండ జిల్లా