telangana
శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు
సూర్య, కాగజ్నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఇస్గాం గ్రామంలోని శివాలయం ఈరోజు మంగళవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తజన సందోహంతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని పరమశివుడిని దర్శించుకున్నారు. శివనామస్మరణలు, భక్తుల పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, శివలింగం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేస్తూ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని పరమశివుడిని ప్రార్థించారు. పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఉదయం నుంచే ఆలయానికి భక్తుల రాక కొనసాగడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయమంతా దీపకాంతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు ఎంతో భక్తిపారవశ్యంతో కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని శివనామస్మరణతో ఆ పరమేశ్వరుడిని కొలిచారు.