వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు!
కొండాపూర్;ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం, రైస్ మిల్లుల వద్ద ధాన్యం పట్టించడంలో ఆలస్యం కారణంగా రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు వర్ష సూచనలతో ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఇంకా వరి కోతలు పూర్తికాకపోవడంతో చివరి దశ పంటను విక్రయించుకోవడం సవాలుగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.