పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం - మోటివేషన్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి
సూర్య,కౌటాల:పిల్లలపై నిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరమని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఎస్ ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అభ్యాస స్కూల్లో విద్యార్థుల తల్లితండ్రులకు ఆర్ట్ ఆఫ్ పేరెంట్స్ ప్రోగ్రాం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సంరక్షణ పర్యవేక్షణ తల్లిదండ్రులపై ఉందన్నారు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? లేక మొబైల్ ఫోన్లో ఉంటున్నారా?వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే వాటిపై నిత్యం పర్యవేక్షించాలని ఆయన సూచించారు. తల్లితండ్రులు వారి పనులపై వెళ్లడంతో పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల చాలావరకు పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. పిల్లల చిన్న వయసులోనే వారికి పర్యవేక్షణ చేస్తూ మంచి నడవడిక వచ్చేలా వారికి అవసరమైన చదువు అందుతుందా లేదా అనే దానిపై నిత్యం పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా ఈ తరం పిల్లలు సెల్ ఫోన్ లకు అలవాటు కావడం వలన భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుందని దానివల్ల మంచి కన్నా పిల్లలకు చెడు ఎక్కువగా అభ్యసించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మన పనులను మనం చేసుకోవడం కోసం పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం వలన గేమింగ్, సోషల్ మీడియా, ఇతర వీడియోలు చూడడం వల్ల వారు చదువుపై శ్రద్ధ చూపకపోవడం జరుగుతుందని, అదేవిధంగా ఇప్పటినుండే విద్యార్థులు ఫోన్లో వచ్చే పలు రకాల చెడు అలవాట్లకు దగ్గర అయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవలే ఒక చిన్న పిల్లవాడు ఎల్కేజీ పాపను పాఠశాల గదిలో బండరాయితో కొట్టిన ఘటన అందర్నీ కలచి వేసిందని, దానంతటి కారణం ఆ అబ్బాయి సెల్ఫోన్లో ఎక్కువగా క్రైమ్ వీడియోస్ చూడటం వల్ల ఒకరిపై ఎలా దాడి చేయాలనే దానిపై దృష్టి సారించి ఆ విధంగా ప్రవర్తించినట్లు పరిశోధనలో తేలింది అన్నారు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉన్నందున ప్రతి తల్లిదండ్రులు మన పనులతో పాటు పిల్లల చదువు సంస్కారం ఇతర అలవాట్లపై నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అంజితరావు, డైరెక్టర్ సంఘ కిరణ్ కుమార్, ప్రిన్సిపాల్ లావణ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.,