వీఆర్ఏలకు వైఎస్సార్‌టీయూసీ సంపూర్ణ మద్దతు: సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్తామని గొలుగూరి సూర్రెడ్డి భరోసా..
సూర్య డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా & ఆలమూరు డెస్క్: ఆలమూరులో 26వ రోజుకు చేరిన నిరసన దీక్ష: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) చేపడుతున్న పోరాటానికి వైఎస్సార్‌టీయూసీ అన్ని విధాలా అండగా ఉంటుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొలుగూరి సూర్రెడ్డి స్పష్టం చేశారు. ఆలమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్ వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యూత్ నేత నాండ్ర నాగ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గొలుగూరి సూర్రెడ్డి నేతృత్వంలోని బృందం దీక్షా శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది.
శిబిరాన్ని ఉద్దేశించి సూర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా వీఆర్ఏలు చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు వైఎస్సార్‌టీయూసీ పూర్తి మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ద్వారా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం పోరాటానికి మద్దతుగా వైఎస్సార్‌టీయూసీ తరపున వీఆర్ఏల మండల శాఖకు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తమలంపూడి ఈశ్వరరెడ్డి, తాడి మధుసూదన్ రెడ్డి, ఇంద్రారెడ్డి, ఆనంద్ మోహన్ రెడ్డిలతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, వీఆర్ఏ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.