వైభవంగా వేపచెట్టు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు
అమలాపురం మేజర్ న్యూస్ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అమలాపురం కల్వకొలను వీధిలో కొలువుదీరిన శ్రీ వేపచెట్టు కనకదుర్గమ్మ ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు సందర్భంగా నిర్వహించిన దివ్య కలశ స్థాపన మహోత్సవాన్ని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యేడిద శ్రీను, నాగ రామలక్ష్మి దంపతులు శాస్త్రోక్తంగా నెరవేర్చారు.
కలశ స్థాపన అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ విఘ్నేశ్వర పూజ, చండీ పారాయణం, విశేష అభిషేకాలు మరియు కుంకుమార్చన తదితర వైదిక క్రతువులు భక్తిప్రపత్తులతో సాగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శత చండీ సహిత శ్రీ రుద్రయాగాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. విశేష పూజలు, హోమాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పునీతమైంది.
తొలిరోజు పూజలకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి శ్రీ వేపచెట్టు కనకదుర్గమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ వేపచెట్టు కనకదుర్గ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.