తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి - కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : మురసు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ వై.ఓ నందన్ తెలియజేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ తీసుకుంటున్న తుఫాను సహాయ చర్యల గురించి సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు వివరించారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లు, కూలిపోయే స్థితిలో ఉన్న గోడలు వంటి నిర్మాణాలలో ప్రజలు నివాసం ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగులు విరిగిపడే అవకాశాలు ఉన్నందున వాటి నుంచి ముందస్తు రక్షణ పొందేలా జాగ్రత్త వహించాలని సూచించారు. నగరపాలక సంస్థ అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామని, భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను గుర్తించి వరద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలను తీసుకునేందుకు సంసిద్ధం చేశామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 25 ప్రాంతాలలో వరద సహాయక పునరావాస కేంద్రాలను గుర్తించామని, వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన అన్ని వసతులను కేంద్రాలలో కల్పించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. తుఫాను నేపథ్యంలో వరద ప్రభావానికి గురై ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ భాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు 0861- 2356777, 1800 425 1113 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందగలరని కమిషనర్ సూచించారు.