ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
సూర్య - పెద్దపల్లి:
ప్రజావాణిలో అందిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన జోగుల లచ్చయ్య తన భూమికి పట్టాదారు హక్కులు కల్పించాలని, శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన జాసోదపు లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. మంథని మండలం నాగారానికి చెందిన దివ్యాంగుడు గాజుల ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, గోదావరిఖని 18 ఇంక్లైన్ కాలనీకి చెందిన గంట నరసమ్మ గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని అర్జీలు సమర్పించారు.సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను పంపిన కలెక్టర్, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.