చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది!
• తక్షణ మరమ్మతులు చేపట్టాలి.. ప్రజావాణిలో బీజేపీ నాయకుల వినతి
సూర్య, లక్షెట్టిపేట :
మండలంలోని దౌడేపల్లి – పాత కొమ్ముగూడెం గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్టకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని, తక్షణమే మరమ్మతులు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని బీజేపీ లక్షెట్టిపేట మండల నాయకులు కోరారు.
ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించి చెరువు కట్ట పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్టకు పగుళ్లు ఏర్పడటంతో గ్రామస్తులు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ గ్రామస్తులు, రైతులు చెరువు కట్ట మీదుగా రాకపోకలు సాగిస్తుంటారని, కట్ట పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. చెరువు కట్ట మరింత దెబ్బతింటే తెగిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే దిగువన ఉన్న పంట పొలాలు నీట మునగడంతో పాటు పరిసర ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి చెరువు కట్ట పటిష్టతను పరిశీలించాలని, పగుళ్లను పూడ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హనుమంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.