రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక.
బ్రహ్మసముద్రం: క్రీడారంగంలో ప్రతిభకు పట్టుదల తోడైతే విజయాలు సాధ్యమని వేపులపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మేఘన నిరూపించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కోకో క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్న అనంతపురం జిల్లా జట్టుకు ఎంపికైంది. జిల్లా జట్టు ఎంపిక కోసం నిర్వహించిన పోటీలకు జిల్లాలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగా, మేఘన తన ఆటతీరు, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విజయానికి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సచిన్ అందించిన శిక్షణ, ప్రోత్సాహం తోడయ్యాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, నిరంతర సాధన ఉంటే రాష్ట్రస్థాయిలోనూ రాణించగలరని మేఘన ఎంపిక నిరూపించింది. ఈ సందర్భంగా విద్యార్థిని మేఘనతో పాటు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సచిన్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రోషన్ భాష అభినందించారు. ఉపాధ్యాయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మేఘన విజయం సాధించి పాఠశాలకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.