ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
అనంతపురం / అమరావతి:రాప్తాడు పాఠశాలలో బాలికపై జరిగిన దారుణ ఘటనపై కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ వల్లే నేరస్థులకు చట్టమంటే భయం లేకుండా పోయిందని, దాంతోనే ఇటువంటి పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరకడమే కాకుండా, విపరీతంగా పెరిగిపోయిన బెల్ట్ షాపులే ఈ అరాచక పరిస్థితులకు ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు.
ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉంటూ, పరిస్థితి మెరుగుపడుతోందని తెలుసుకోవడం సంతోషకరమని పేర్కొన్న ఆయన, ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.