చిన్నారుల భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి -శిశుగృహ ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సూర్య - పెద్దపల్లి: సంరక్షణ అవసరమైన చిన్నారుల భద్రత, ఆరోగ్యం, సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రేమపూర్వక సంరక్షణ అందించాలని సూచించారు.
సోమవారం సుల్తానాబాద్‌లోని బాలసదన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిశుగృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల సంరక్షణకు నోచుకోని, అనాథ, వదిలివేయబడిన చిన్నారులకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడమే శిశుగృహ లక్ష్యమన్నారు. జననం నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహారం, వైద్య సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు వయస్సుకు తగిన అభివృద్ధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన, సురక్షిత వాతావరణం కల్పించాలని సూచించారు. అర్హులైన చిన్నారులకు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా కుటుంబ వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రమేష్, సీడీపీఓ అనిత, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి జితేందర్, బాలసదన్ సిబ్బంది పాల్గొన్నారు.