తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు*
తుగ్గలి (పత్తికొండ): మండల పరిధిలోని జి. ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, జొన్నగిరి గ్రామాల్లో వైకాపా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సోమవారం హోరెత్తింది. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో అండగా నిలిచాయని వివరించారు. అమ్మఒడి, రైతుభరోసా, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతిదీవెన, ఆరోగ్యశ్రీ, పింఛన్ల పెంపు, ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీల అమలులో తీవ్ర జాప్యం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వం వచ్చి దాదాపు రెండున్నర ఏళ్లయినా ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని పింఛన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మోసపూరిత మాటలను గమనించి, ఈనెల 5న జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీదేవమ్మ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా ఉపాధ్యక్షుడు, మండల కమిటీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.