telangana
అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
సూర్య-నవీపేట్ : గోదావరి నది తీరంలో నిబంధనలకు విరుద్ధంగా చేప పిల్లల అక్రమ దందాను కొనసాగిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకొని మత్స్యకారులకు సహకరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో మండలంలో గల నందిగాం గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే. నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట, సాలాపూర్ గ్రామాలలో గోదావరి నది పరివాహక ప్రాంతాలలో గ్రామ అభివృద్ధి కమిటీ అనధికారిక టెండర్లు నిర్వహించి లక్షలు ఆదాయం సమకూర్చుకుంటూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అక్రమ వ్యాపారులకు టెండర్లు అప్పగిస్తున్నారు. దీంతో రెచ్చిపోయిన అక్రమార్కులు వర్షాలు తగ్గుముఖం పట్టగానే గుడారాలు ఏర్పాటు చేసుకొని జీరో పాయింట్ వలలతో మండలంలో గల నందిగాం సరిహద్దు ప్రాంతంలోకి వెళ్లి చేపల వేటను కొనసాగించి అవతలి ఒడ్డుకు చేప పిల్లలను తీసుకెళ్లి ఎండబెట్టి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షలలో పోగు చేసుకుంటున్నారని వాపోయారు. గోదావరి నదిలో చేపల వేట కొనసాగించాలంటే మత్స్యశాఖ సొసైటీల ద్వారా లైసెన్స్ కలిగి ఉండి, మత్స్య శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ గోదావరి నది తీరంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటూ బహిరంగంగా చేపల వేట కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు అటువైపు వెళ్ళకుండా చోద్యం చూస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు పెట్టి గోదావరి నదిలో చేప పిల్లలను వదలడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వదిలిన చేప పిల్లలను అక్రమార్కులు జీరో పాయింట్ వలలతో వేటాడి సొమ్ము చేసుకోవడంతో చేపల వేట పై ఆధారపడిన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులకు సహకరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్రామ అభివృద్ధి కమిటీల పై చర్యలు తీసుకొని, నిర్మల్ జిల్లా బాసర మండలం కౌటా గ్రామంలో గుడారాలు ఏర్పాటు చేసుకొని నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నందిగాం గ్రామ సరిహద్దు ప్రాంతంలో చేపల వేట కొనసాగిస్తున్న అక్రమ వ్యాపారులపై మత్స్యశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చెట్టు కింద గంగాధర్, ఎల్ సాయిలు, సిహెచ్ రాజు, సిహెచ్ సాయిలు, లక్ష్మణ్, రమేష్, లింగం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.