మహానేత ఎర్రన్నాయుడు ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తాం
శ్రీకాకుళం, సూర్య : కేంద్ర మాజీ మంత్రివర్యులు, దివంగత నేత స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి సందర్భంగా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఎర్రన్న స్మృతి వనంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన విశేష సేవలను, ప్రజల సంక్షేమం కోసం చేసిన నిరంతర కృషిని, రాజకీయాల్లో ఆయన నెలకొల్పిన విలువలను స్మరించుకున్నారు. ప్రజలే ప్రథమంగా సాగిన ఎర్రన్నాయుడు జీవితం, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.