స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్‌తో భేటీ సమావేశంలో పాల్గొన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
అనంతపురం బ్యూరో, (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూటమి నాయకులు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై అనంతపురం జిల్లా కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించారు. అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో జరిగిన ఈ సమావేశంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు.
జిల్లా ఇంచార్జ్ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకుడు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటప్రసాద్, బండారు శ్రావణితో కలిసి అమిలినేని సురేంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికలపై దిశానిర్దేశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు, పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు, ఎన్నికల నిర్వహణలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపై నాయకులు దృష్టి సారించారు.
విజయమే లక్ష్యంగా కూటమి నేతల కార్యాచరణ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు ముందుకు సాగుతున్నారు. జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గాలు, వార్డుల స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావడంపై సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైన కార్యాచరణను అమలు చేసేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయి నాయకులతో జరిగిన ఈ సమావేశం స్థానిక ఎన్నికల సన్నద్ధతకు దిశానిర్దేశం చేయనుంది.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.