నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం
• బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గుంటలో పడిన బాలిక..
• కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు మృత్యువాత
సూర్య, జైపూర్ : మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వలస కూలీలుగా గుర్తించబడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బట్టలు ఉతికేందుకు వెళ్లిన సమయంలో కావ్య (9) అనే బాలిక నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మనెమ్మ (24), కీర్తన (16) కూడా నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.