మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్
సూర్య ప్రతినిధి, మార్కాపురం.;మార్కాపురం జిల్లా ప్రజా పరిషత్ నూతన ముఖ్య కార్యనిర్వహాణాధికారి జోసఫ్ కుమార్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాబోయే ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు-2026ను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని, అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సూచనలు, ఆదేశాలను స్వీకరించిన అనంతరం ఆయన మార్కాపురం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని అధికారికంగా విధుల్లో చేరారు .ఈ సందర్భంగా మార్కాపురం జడ్పీ డిప్యూటీ సీఈఓ డాక్టర్ పి. సుజాత నూతన సీఈఓ కి పుష్పగుచ్ఛం అందించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన సీఈఓ గంగవరపు జోసఫ్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ మార్గదర్శకత్వంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంతో పాటు జిల్లా పరిధిలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాలు మరియు పంచాయతీ రాజ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.