ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్
గాజువాక, సూర్య : జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వేస్టేషన్ రోడ్డులో పోలీసులు ఆదివారం సాయంత్రం భారీ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు, సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ వై. శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడటంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్‌మార్చ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించిన ఈ కవాతులో గాజువాక సీఐ వాసు నాయుడు, దువ్వాడ సీఐ నమ్మి గణేష్, స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావులతో పాటు సౌత్ సబ్ డివిజన్‌కు చెందిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
రిపోర్టర్ : కోటిరెడ్డి, గాజువాక, విశాఖపట్నం