స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు
కర్నూలు, అక్టోబర్ 3:- స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ లను, ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఎన్నికల యాక్షన్ ప్లాన్, రవాణా, ఎన్నికల సామగ్రి తరలింపు, కమ్యూనికేషన్, వెబ్‌కాస్టింగ్ తదితర ఏర్పాట్ల పై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.. పోలింగ్ స్టేషన్లలో సాధారణ, సెన్సిటివ్, క్రిటికల్, వల్నరబుల్ తదితర కేటగిరీలుగా గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను కూడా ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అదనపు ఎస్పీ కి సూచించారు...
ఎన్నికల విధుల్లో భాగంగా నోడల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా పూర్తి చేసి ఫైల్ సమర్పించాలని కలెక్టర్ డిఆర్ఓ ను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు..పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి అలసత్వానికి తావు ఉండకూడదని, ప్రతి పోలింగ్ స్టేషన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, భద్రతా ప్రమాణాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు పూర్తిస్థాయిలో భద్రతతో ఉండేలా చూడడంతో పాటు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా, తగిన వెంటిలేషన్, లైటింగ్, అవసరమైన టేబుల్స్ తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారులు (POs), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APOs), ఇతర పోలింగ్ సిబ్బంది నియామకానికి అవసరమైన సిబ్బందిని ముందుగానే గుర్తించి, ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉన్న సిబ్బందిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో సిబ్బంది బాధ్యతలు, ప్రక్రియలు, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో వీడియోగ్రాఫర్లు, MCC టీమ్స్, రూట్ ఆఫీసర్లు, వెబ్ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు తదితర ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి, డిపిఓ భాస్కర్, ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, గూడూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.