స్థానిక ఎన్నికల్లో వెనకడుగు వేయొద్దు.. కార్యకర్తలకు అండగా నేనున్నా!
సైదాపురం మండలం మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో భయాందోళనలకు గురై వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, ప్రత్యర్థుల ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలంటే భయపడటం కాదు.. ప్రజల మధ్యకు వెళ్లి ధైర్యంగా తమ పార్టీ విధానాలను వివరించడమే నాయకులు, కార్యకర్తల బాధ్యత అని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వ పాలనతో పోల్చి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు మారే నాయకుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరిగినా, బెదిరింపులు ఎదురైనా కార్యకర్తలు ఏమాత్రం వెనుకడుగు వేయకూడదన్నారు. ఎవరైనా దాడులకు పాల్పడినా, అనవసర ఒత్తిళ్లు తీసుకొచ్చినా భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. "పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. ఎవరికీ అన్యాయం జరగనివ్వను. ఎన్నికల్లో ధైర్యంగా పనిచేయండి.. మీ వెనుక నేను ఉన్నాను" అంటూ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపారు. అభ్యర్థుల మధ్య సమన్వయం, నాయకుల మధ్య ఐక్యత ఎంతో ముఖ్యమని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. మొత్తంగా మర్లపూడి సమీక్ష సమావేశం ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి గట్టి భరోసా కల్పిస్తూ, ఎన్నికల బరిలో ధైర్యంగా నిలబడి పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.