స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలు.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌కు కూటమి నాయకుల కృతజ్ఞతలు.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌ను శనివారం చిత్తూరు రూరల్ మండలానికి చెందిన కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తుమ్మిండుపాళ్యం, పెద్దిశెట్టిపల్లి గ్రామపంచాయతీలకు చెందిన కూటమి నాయకులు, ఏకగ్రీవ అభ్యర్థులు ఎమ్మెల్యేను కలిసి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వారిని అభినందించారు. గ్రామాల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.అలాగే టీడీపీ యాప్ ద్వారా అత్యధిక పాయింట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పంపిన సైకిల్ గుర్తు, ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తుమ్మిండుపాళ్యం, పెద్దిశెట్టిపల్లి గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, ఏకగ్రీవ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్