స్థానిక ఎన్నికలకు సమష్టి వ్యూహంతో సిద్ధం కావాలి..ఆలూరు ఎమ్మెల్యే బూసినె
స్థానిక ఎన్నికలకు సమష్టి వ్యూహంతో సిద్ధం కావాలి
ఆలూరు ఎమ్మెల్యే బూసినె
హొళగుంద, సూర్య (ఆలూరు):
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేస్తూ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో పాటు తాను కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.హొళగుందలో శనివారం నిర్వహించిన మండలస్థాయి పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమష్టి వ్యూహంతో కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి అనైతికమని, ఇది పిరికిపంద చర్య అని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధిపైనే దాడి జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని, పోలీసు వ్యవస్థ పాత్ర ఏమిటని ప్రశ్నించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో పనిచేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.పోటీ చేసే అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీ విజయానికి సమష్టి కృషి కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.