telanagana
పూలనే దేవతగా పూజించే పండుగ బతుకమ్మ: కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలను దేవతగా భావించి పూజించే విశిష్టమైన పండుగ బతుకమ్మ అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శనివారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకల్లో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, పూల వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ వేడుకలు సాంస్కృతిక ఐక్యతను, సామాజిక సౌభ్రాతృత్వాన్ని చాటిచెబుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి కాంతారావు, డీపీఓ జయసుధ, డీపీఆర్ఓ చెన్నమ్మ, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.