టీ పొడిలో పురుగుమందుల అవశేషాల పరిమితుల మార్పు
సూర్య జాతీయ డెస్క్ (న్యూఢిల్లీ): భారతదేశంలో అత్యధికంగా వినియోగించే తేనీరు నాణ్యత, భద్రత ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ) కీలక అడుగు వేసింది. టీ పంటలో ఉపయోగించే ఎసిటామిప్రిడ్ మరియు ఇమిడాక్లోప్రిడ్ అనే రెండు ప్రధాన పురుగుమందుల గరిష్ట అవశేషాల పరిమితులను (MRLs) సవరిస్తూ సవరణ ముసాయిదా నిబంధనలను కేంద్ర గెజిట్‌లో విడుదల చేసింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం టీ పొడిలో ఎసిటామిప్రిడ్ పరిమితిని కిలోగ్రాముకు 20 మిల్లీగ్రాములు (20 పిపిఎమ్), అలాగే ఇమిడాక్లోప్రిడ్ పరిమితిని కిలోగ్రాముకు 50 మిల్లీగ్రాములు (50 పిపిఎమ్)గా నిర్ధారించాలని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ప్రతిపాదించింది.
శాస్త్రీయ విశ్లేషణలు, అంతర్జాతీయ నియంత్రణ పద్ధతులు మరియు భారతీయ వ్యవసాయ రంగానికి ఉన్న అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఈ కొత్త పరిమితులను నిర్ణయించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ వెల్లడించింది. ఎసిటామిప్రిడ్ విషయంలో భారత్ ప్రతిపాదించిన 20 పిపిఎమ్ పరిమితి జపాన్ (30 పిపిఎమ్) మరియు అమెరికా (50 పిపిఎమ్) కంటే చాలా కఠినమైనదని మరియు సురక్షితమైనదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పురుగుమందుల అవశేషాల నిబంధనలను పునఃసమీక్షిస్తున్నామని తెలిపింది.
భారతదేశంలో హెక్టారుకు సగటు పురుగుమందుల వినియోగం 0.5 కిలోగ్రాముల కంటే తక్కువగా ఉండి, ప్రపంచ సగటు అయిన 2.38 కిలోగ్రాముల కంటే గణనీయంగా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. కొత్తగా ప్రతిపాదించిన ఈ పరిమితుల వల్ల తేయాకు రైతులు, ప్రాసెసర్లు, పరీక్షా లాబొరేటరీలు మరియు వ్యాపార వర్గాలకు స్పష్టమైన మార్గదర్శకాలు లభిస్తాయని టీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చర్యల ద్వారా భారతీయ టీ నాణ్యతపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వినియోగదారుల విశ్వాసం మరింత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.