సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరం..:*అక్రమార్కులకు కాసులు పండిస్తున్న మేఘా సంస్థ సిబ్బంది నిర్వాకం
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండల కేంద్రంలో నిర్మాణం చేపట్టిన అమరజీవి జలధార ప్రాజెక్టుకు సంబంధించి మండల వ్యాప్తంగా పైప్‌లైన్ పనులు లో పనిచేస్తున్న సిబ్బంది అలసత్వం మట్టి దొంగలకు వరంగా మారింది. వివరాల్లోకి వెళితే అమరజీవి జలధార కు సంబంధించి నీటి సరఫరాకు ఉద్దేశించిన పైపులైన్లు పనులు పెరవలి మండలంలోని నిడదవోలు నరసాపురం రహదారి వెంబడి నరసాపురానికి నీటి సరఫరా కోసం ఒక పైప్‌లైన్ నిర్మాణాన్ని మేఘా సంస్థ చేపడుతోంది.
అలాగే విజ్జేశ్వరం నుంచి పెరవలి వరకు నిడదవోలు–నరసాపురం రహదారికి మరోవైపు కూడా పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి.రానున్న పుష్కరాల సమయానికి పైప్‌లైన్ పనులను పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు వేగంగా జరుగుతుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల పక్కన పైప్‌లైన్ కోసం భారీగా గుంతలు తవ్వుతున్న నేపథ్యంలో పనుల అనంతరం ఆ గుంతలను, తవ్విన ప్రాంతాలను నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో పూడ్చి, మట్టిని సక్రమంగా చదును చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
తవ్విన మట్టిని సక్రమంగా పైప్‌లైన్‌పై కప్పి, పూర్తిస్థాయిలో చదును చేయకుండా గుట్టలుగా వదిలేస్తే వర్షాల సమయంలో మట్టి కుంగిపోయి గోతులు ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రహదారులు కుంగిపోవడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఈ పనుల్లో భాగంగా కానూరు గ్రామ పరిధిలో రహదారికి ఇరువైపులా భారీ ప్రొక్లైనర్లతో పైప్‌లైన్ కోసం కంకరతో కూడిన మట్టిని తవ్వుతున్నారు. పైప్‌లైన్ ఏర్పాటు చేసిన అనంతరం తవ్విన మట్టిని పూర్తిస్థాయిలో గుంతల్లో వేసి చదును చేయాల్సి ఉండగా, అక్కడక్కడా మట్టిని గుట్టలుగా వదిలేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇదే పరిస్థితి కొందరు అక్రమ మట్టి తరలింపుదారులకు వరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది ప్రొక్లైనర్లు, ట్రాక్టర్లను ఉపయోగించి కంకరతో కూడిన మట్టిని అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్విన మట్టిని పూర్తిగా చదును చేయకుండా గుట్టలుగా వదిలేయడం వల్ల మట్టిని తరలించేవారికి సులభంగా మార్గం ఏర్పడుతోందని వారు అంటున్నారు.మరోవైపు వర్షాలు కురిసినప్పుడు తవ్విన ప్రాంతాల్లో మట్టి క్రమంగా కుంగిపోయి లోతైన గుంతలు ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రహదారుల పక్కన జరుగుతున్న తవ్వకాల కారణంగా రోడ్డు భద్రతపై ఆందోళన నెలకొంటుండగా, మట్టిని సక్రమంగా తిరిగి నింపకపోతే భవిష్యత్తులో రహదారి కుంగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ప్రజలకు తాగునీరు అందించేందుకు భారీ నీటి పైప్‌లైన్లను ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమమే అయినప్పటికీ, అందుకు అనుగుణంగా తవ్విన ప్రాంతాలను తిరిగి పూడ్చడం, మట్టిని సమాంతరంగా చదును చేయడం, రహదారులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.“పైప్‌లైన్ పనులు వేగంగా పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, పనులు పూర్తయిన తర్వాత తవ్విన ప్రాంతాలను సురక్షితంగా పునరుద్ధరించడం కూడా అంతే ముఖ్యం. మట్టిని గుట్టలుగా వదిలేసి అక్రమంగా తరలించడానికి అవకాశం కల్పించడం ఏమిటి? భవిష్యత్తులో రోడ్డు కుంగిపోయినా, గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగినా బాధ్యత ఎవరిది?” అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.తవ్విన మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఏమైనా అనుమతులు ఉన్నాయా? పైప్‌లైన్ వేసిన తర్వాత గుంతలను పూర్తిగా పూడ్చి చదును చేస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు తక్షణమే స్పందించి పైప్‌లైన్ పనులను పరిశీలించాలని, తవ్విన ప్రాంతాలను నిబంధనల ప్రకారం పూర్తిగా పూడ్చి సమాంతరంగా చదును చేయాలని, మట్టి అక్రమ తరలింపుపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయడంతో పాటు, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.