శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల మేజర్ న్యూస్,
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది.ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, దీపావళి పర్వదినాన శ్రీవారి భక్తులతో పాటు ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆప్తులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఉగాది, ఆణివార ఆస్థానం, దీపావళి, శ్రీరామనవమి, గోకులాష్టమి సందర్భంగా సంవత్సరానికి నాలుగుసార్లు ఆస్థానం నిర్వహిస్తారని తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో స్వామివారి కృపతో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల రిపోర్టర్
టీ. వెంకటారాజ్