‘రీకౌంటింగ్ వదులుకుని పెద్ద తప్పు చేశాం’
తిరుపతి: తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి, టీడీపీ నాయకురాలు సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల ఫలితాలపై రీకౌంటింగ్ కోరకపోవడం తాము చేసిన పెద్ద తప్పు అని ఆమె పేర్కొన్నారు. తిరుపతి రూరల్ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సుధారెడ్డి, తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కౌంటింగ్ రూమ్‌ను మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం 600 ఓట్ల తేడాతోనే ఓటమి నమోదైందని, అయితే అక్కడ 2,000కు పైగా చెల్లని ఓట్లు (ఇన్వాలిడ్ ఓట్లు) ఉన్నాయని తెలిపారు. ఫలితాలపై రీకౌంటింగ్ పిటిషన్ వేయాలని తాము బలంగా భావించినప్పటికీ, చెవిరెడ్డి కుటుంబ సభ్యుల వేడుకోలు, అభ్యర్థనల వల్లే వెనక్కి తగ్గామని సుధారెడ్డి వెల్లడించారు. చెవిరెడ్డి పెద్ద కొడుకు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాడని, ఇప్పుడు చిన్న కొడుకు కూడా జెడ్పీటీసీగా ఓడిపోతే డిప్రెషన్‌లోకి వెళ్తాడని వారి కుటుంబ సభ్యులు బతిమాలడంతో మానవతా దృక్పథంతో ఆలోచించి రీకౌంటింగ్ పిటిషన్ వేయలేదని ఆమె వివరించారు.