CBI, EDలకు ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులకు ఆధారాలతో స్టేట్‌మెంట్ ఇచ్చిన బండారి శేఖర్
సూర్య కరీంనగర్: ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యం, కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బియ్యం అక్రమ మళ్లింపు, రవాణా, నిల్వ, రీ-ప్రాసెసింగ్, రీ-బ్రాండింగ్, వాణిజ్య విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను CBI, ED అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుపై సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జూలై 3, 2026న PDS, CMR బియ్యం అక్రమాలపై అంతర్‌రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని CBI, EDలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదుపై CBI అధికారులు తెలంగాణ డీజీపీకి లేఖ రాయగా, డీజీపీ ఆదేశాల మేరకు సివిల్ సప్లై విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలో సివిల్ సప్లై విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ పండరి తదితర అధికారులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చి, తన వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను అందజేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి నమోదైన కొన్ని కేసుల వివరాలు, కేసు నంబర్లతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ప్రభుత్వం పేదలకు రాయితీపై అందించాల్సిన PDS బియ్యాన్ని అక్రమంగా మళ్లించి, నిల్వ చేసి, మిల్లింగ్, రీ-ప్రాసెసింగ్, రీ-బ్రాండింగ్ ద్వారా వాణిజ్యపరంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరగాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించినట్లు ఆరోపిస్తున్న ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల అక్రమ సంపద కూడబెట్టడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నట్లు తన ఫిర్యాదులో వివరించినట్లు తెలిపారు.
ఈ అక్రమాల వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్న రైస్ మిల్లుల యజమానులు, రవాణాదారులు, మధ్యవర్తులు, కమీషన్ ఏజెంట్లు, ఫైనాన్షియర్లు, బినామీ ఆస్తుల వ్యవహారాలపై లోతైన విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. బ్యాంకు ఖాతాలు, నగదు లావాదేవీలు, వాణిజ్య సంస్థలు, మిల్లులు, రవాణా వ్యాపారాల ఆర్థిక లావాదేవీలను పరిశీలించి మనీ ట్రయల్‌ను వెలికితీయాలని, నేరం ద్వారా సంపాదించినట్లు నిర్ధారణయ్యే ఆస్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
అవసరమైతే మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద విచారణకు సంబంధించిన అంశాలను ED అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అంతర్రాష్ట్ర స్థాయిలో సమన్వయంతో దర్యాప్తు చేపట్టి బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు బండారి శేఖర్ తెలిపారు.
ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ ధనాన్ని కాపాడేందుకు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.