శభాష్ విశాఖ పోలీస్.. గంట వ్యవధిలోనే బాలిక రక్షణ!
గాజువాక, సూర్య : అర్ధరాత్రి వేళ కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను విశాఖ సిటీ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి గంట వ్యవధిలోనే సురక్షితంగా రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. మింది గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని (13) సోమవారం తెల్లవారుజామున 3.10 గంటలకు అపహరణకు గురైంది. పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సౌత్ క్రైమ్ బ్రాంచ్ సీఐ జి.డి. బాబు, గాజువాక లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ జగదీష్, సిబ్బంది విజయ్ అనంత కుమార్, నాగేంద్ర సంతోష్ కుమార్, దేవర సోమేశ్ తక్షణమే రంగంలోకి దిగారు. టెక్ సెల్ సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గాలింపు చేపట్టిన పోలీసులు, బీసీ రోడ్డు వైపు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో బాలికను గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు నిమిత్తం బాధ్యతలను గాజువాక లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీఐ జి.డి. బాబు స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలు వెంటనే 112కు లేదా గాజువాక పోలీసులను 9490617922 నంబరులో సంప్రదించాలని కోరారు. అర్ధరాత్రి వేళ క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడిన పోలీసుల తీరును మింది గ్రామస్థులు ‘శభాష్ విశాఖ పోలీస్’ అంటూ ప్రశంసించారు.