సీసీ కెమెరాలతో 30 నిమిషాల్లో ఆటో గుర్తింపు.. పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: అత్యాధునిక సీసీ కెమెరాల సాయంతో కేవలం 30 నిమిషాల్లో ఆటోను గుర్తించి, పోగొట్టుకున్న బ్యాగ్‌ను బాధితులకు సురక్షితంగా అప్పగించి ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రయాణికులు కనకదుర్గమ్మ దర్శనం అనంతరం దుర్గా ఘాట్ వద్ద ఆటో ఎక్కి సాయిరామ్ హోటల్ వద్ద దిగే సమయంలో బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయారు. బ్యాగ్‌లో దివ్యాంగుడైన కుమారుడికి సంబంధించిన పింఛన్ కార్డులు, రైల్వే పాస్ కార్డులు ఉండటంతో ఆందోళనకు గురైన బాధితురాలు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి.దుర్గారావు సూచనలతో కానిస్టేబుల్ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ సీసీ కెమెరాల ద్వారా ఆటోను గుర్తించి డ్రైవర్ సహకారంతో బ్యాగ్‌ను తిరిగి బాధితులకు అందజేశారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరును నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.