రేపు శ్రీమఠం నిర్వహణలో.. తుంగాహారతి, లక్షదీపోత్సవం
మంత్రాలయం, సూర్య ప్రతినిధి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రాలయంలోని పవిత్ర తుంగభద్ర నదీతీరంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా తుంగహా రతి – పుణ్యనది హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం అధికారులు వెల్లడించారు.
శ్రీ మఠం పీఠాధిపతులు పరమపూజ్య శ్రీ సుబుధేంద్రతీర్థ శ్రీపాదులవారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీపాదులవారు ఉభయ వేద పద్ధతుల్లో కృష్ణం నుంచి నదీతీరానికి విచ్చేసిన అనంతరం పవిత్ర తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నదికి హారతి, అర్చకులచే పంచదీప హారతులు సమర్పించనున్నారు.
ఈ వేడుకలను పురస్కరించుకుని నదీతీరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీ గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన మండళ్లచే భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల భాగస్వామ్యంతో నదీతీరంలో లక్షదీపోత్సవం నిర్వహించనున్నార కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీపాదులవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని శ్రీ మఠం అధికారులు కోరారు.
*నల్లారెడ్డి, సూర్య ప్రతినిధి, మంత్రాలయం, కర్నూలు జిల్లా
*