telangana
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో బాల్య వివాహాల ముక్త్ భారత్ 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమాల సంబంధిత గోడ ప్రతులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాల వలన చిన్న వయసులోనే బాలికలు అనేక సామాజిక, ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొంటారని తెలిపారు. బాల్య వివాహాలు నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి బాలల సంరక్షణ కమిటీలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని బాలికలు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూప, బాలల సంరక్షణ అధికారి మహేష్, ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త సంతోష్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.