5 లక్షలు విలువైన నగదు బహుమతులు గల బ్రోచర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే.
కళ్యాణదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించేందుకు నిర్వహించనున్న ‘వదాన్య ప్రతిభా పరీక్ష-2026’కు సంబంధించిన బ్రోచర్లను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష ఒక మంచి అవకాశమని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు, వారి విద్యా సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థుల కోసం ‘వదాన్య’ సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 27న ‘వదాన్య ప్రతిభా పరీక్ష-2026’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తమలోని ప్రతిభను చాటుకునేందుకు వేదిక కల్పించడంతో పాటు, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి నగదు బహుమతులతో ప్రోత్సహించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు అనంతపురం ఆర్ట్స్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా జిల్లా స్థాయి పోటీలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం రూ.5 లక్షల విలువైన నగదు, ఇతర బహుమతులను అందజేయనున్నారు. ఓవరాల్ విజేతల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.25,000, ద్వితీయ స్థానానికి రూ.20,000, తృతీయ స్థానానికి రూ.15,000 నగదు బహుమతులు అందించనున్నారు. అదేవిధంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వారీగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.10,000, రూ.9,000, రూ.8,000, రూ.7,000, రూ.6,000 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు. మండల స్థాయిలో అత్యధిక ప్రతిభ కనబరిచిన ప్రతి మండల టాపర్‌కు రూ.3,000 విలువైన బహుమతి అందించనున్నారు. అంతేకాకుండా ఈ పరీక్షలో పాల్గొన్న ప్రతి పాఠశాలకు కూడా ఒక బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇలాంటి ప్రతిభా పరీక్షలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా తమ జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ పరీక్షలో పాల్గొనాలనుకునే అర్హులైన విద్యార్థులు www.vadaanya.org వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు, సందేహాల నివృత్తి కోసం 63059 44038, 62810 85951 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. డిసెంబర్ 27న నిర్వహించనున్న ఈ ప్రతిభా పరీక్షను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందాలని వారు ఆకాంక్షించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.