ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు!
వెల్దుర్తి, మేజర్ న్యూస్:స్థానిక మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కీలక దశలో కొనసాగుతుండగా, ఎన్నికల విధులు కేటాయించిన జూనియర్ అసిస్టెంట్ హరిజన వెంకట్రాముడు గత రెండు రోజులుగా విధులకు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. అతి ముఖ్యమైన ఎన్నికల సమయంలో సిబ్బంది గైర్హాజరవుతున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తోటి ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నిస్తే.. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెబుతూ, గతంలో ఎప్పుడో చికిత్స తీసుకున్న పాత ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అతను ఆసుపత్రిలో లేడని, సొంత ఊరైన కోడుమూరు పట్టణంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడని ఆయన కుటుంబ సభ్యుల ద్వారానే తెలిసినట్లు సమాచారం.ఈ విషయం తెలిసినప్పటికీ మండల ఎన్నికల అధికారి, ఎంపీడీవో జి.వి. చంద్రశేఖర్ రెడ్డి గానీ, డిప్యూటీ ఎంపీడీవో (పంచాయతీ రాజ్) రవికిషోర్ గానీ, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రహమత్ బాషా గానీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సదరు ఉద్యోగి ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు, జూనియర్ అసిస్టెంట్ చేయాల్సిన ఎన్నికల పనులను స్థానిక పంచాయతీ అభివృద్ధి అధికారి ఇతర సిబ్బందిపై మోపుతూ వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పేరుతో తప్పుడు సమాచారం ఇస్తూ అత్యవసరమైన ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన జూనియర్ అసిస్టెంట్ వెంకట్రాముడుపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. సిరిని స్థానికులు కోరుతున్నారు.