BREAKING
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు కేటీఆర్‌వి పగటి కలలుః ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి

Select Suryaa Now
 ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి


సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః ‎గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆదాయాన్ని, వనరులను దుర్వినియోగం చేయడంతో పాటు రాష్ట్రాన్ని రూ.8.20 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి ప్రజలకే చేరవేస్తూ, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే, ప్రస్తుతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ‎హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి సందీప్ కుమార్‌ను సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సందీప్ కుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. సంస్థాగత వ్యవహారాల్లో, యువజన కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సందీప్ కుమార్ సేవలు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
‎
‎పార్టీలో విభేదాల్లేవు.. క్రమశిక్షణ సహజం
‎
‎కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని భట్టి విక్రమార్క ఖండించారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, ఊహాజనిత ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ పటిష్టంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యాచరణతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఏ సంస్థకైనా క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, అది కాంగ్రెస్ పార్టీకి సహజమైన అంతర్భాగమని పేర్కొన్నారు. ‎కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై బీఆర్‌ఎస్ నాయకత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని భట్టి మండిపడ్డారు. తెలంగాణకు నదీ జలాల ద్వారా అత్యధిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నవి కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
‎గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల అంశంపై వాస్తవాలను, పూర్తి లెక్కలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని చెప్పారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు.
‎
‎ప్రజల స్వేచ్ఛను హరించిన గత పాలన
‎
‎గత పదేళ్లలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్వేచ్ఛలేని జీవితాన్ని అనుభవించారని భట్టి అన్నారు. రాష్ట్రంలోని వనరులు దోపిడీకి గురికావడం, వ్యవస్థలు దెబ్బతినడం, ఆస్తులు ధ్వంసం కావడం వంటి పరిణామాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఇక్కడి వనరులు, ఆస్తులు, సంస్థలు తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్నదేనని వివరించారు. అయితే పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయంతో పాటు భారీగా అప్పులు తెచ్చి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని విమర్శించారు.

‎
‎ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
‎
‎కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రైతు భరోసా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 46 లక్షల కుటుంబాలకు చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
‎ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని, రోజువారీ అల్పాహారంతో పాటు వారంలో ఆరు రోజుల్లో రోజు విడిచి రోజు పాలు, రాగిజావ అందిస్తున్నామని చెప్పారు. 12 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఏడాదికి రూ.10 లక్షల వరకు వైద్య సేవలు పొందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
‎
‎విద్య, మహిళా సాధికారతకు పెద్దపీట
‎
‎విద్యారంగంలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని భట్టి తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాలు, విద్యా సదుపాయాలు, క్రీడలు, ఇతర పాఠ్యేతర కార్యకలాపాలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 106 పాఠశాలలను మంజూరు చేశామని, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ‎మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని, ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందించడంతో పాటు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ బీమా, చేయూత పింఛన్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ, విద్య, గృహ నిర్మాణం వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
‎
‎ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
‎
‎రాష్ట్రానికి వచ్చే ఆదాయం, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే నిధులను తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని  స్పష్టం చేశారు. గతంలో ఇంతకంటే ఎక్కువ ఆదాయం, అప్పులు ఉన్నప్పటికీ ప్రజలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతూ, పేద కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత పదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రజలు గత పాలనను, ప్రస్తుత ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకుంటున్నారని, గతంలో మాదిరిగా మళ్లీ రాష్ట్రాన్ని దోపిడీ పాలనలోకి నెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
‎ఎ.రవీందర్‌, హైదరాబాద్‌. 
‎