రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు.. ఆరు నెలలుగా ఆర్డీవో విచారణలో జాప్యం!
సీఎం , కలెక్టర్ల ఆదేశాలున్నా కదలని రెవెన్యూ యంత్రాంగం.
విచారణ తేలేంతవరకు వివాదాస్పద భూమిని డిస్ప్యూట్ రిజిస్టర్‌లో చేర్చాలని తహసీల్దార్‌కు వినతి
హిరమండలం, నవంబర్ 13 (మేజర్ న్యూస్):
హిరమండలం మండలం లోకొండ రెవెన్యూ పరిధికి చెందిన వన్నారి పెరుమాళ్లుకు వారసత్వంగా సంక్రమించిన సుమారు 65 సెంట్ల మెట్టు భూమి రికార్డులు జగనన్న భూ సమగ్ర సర్వే సమయంలో వేరొకరి పేరుపై తప్పుగా నమోదయ్యాయని, వాటిని సరిచేయించుకునేందుకు సుమారు రెండేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మండల తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమస్యను సమగ్రంగా పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశాలు అందినట్లు, అనంతరం ఆర్డీవో స్థాయిలో ఆర్ ఓ ఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. అయితే ఆదేశాలు వెలువడినప్పటికీ సుమారు ఆరు నెలలుగా విచారణలో జాప్యం జరుగుతోందని వన్నారి పెరుమాళ్లు ఆరోపించారు. తన భూమికి సంబంధించిన దరఖాస్తు ఏ దశలో ఉందో, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, సమస్య ఎప్పటిలోగా పరిష్కారమవుతుందో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఇరుపక్షాల వారికి విచారణ నోటీసులు జారీ చేసినప్పటికీ, పలుమార్లు కార్యాలయానికి హాజరైన సమయంలో వివిధ కారణాలు చెబుతూ విచారణ జరపకుండానే వెనక్కి పంపించారని ఆరోపించారు. చివరకు తన దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలను సక్రమంగా పాటించకుండా, ఇంతవరకు ఎటువంటి విచారణ జరపకుండా.. దరఖాస్తు సమర్పించలేదన్న కారణంతో విచారణ రద్దు చేసినట్లు పేర్కొంటూ తప్పుడు ఎండార్స్‌మెంట్ జారీ చేశారని వాపోయారు. సంబంధిత అధికారుల నుంచి సరైన పరిష్కారం లభించకపోవడంతో తన వారసత్వ భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన వన్నారి పెరుమాళ్లు, తదుపరి చర్యలు తీసుకునే వరకు భూమి రికార్డుల విషయంలో తనకు నష్టం కలగకుండా వివాదాస్పద భూమిని తాత్కాలికంగా డిస్ప్యూట్ ల్యాండ్ రిజిస్టర్‌లో చేర్చాలని కోరుతూ హిరమండలం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందించినట్లు పాత్రికేయులకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోంది? బాధితుడి ఫిర్యాదుపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? అనే అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని ఆయన కోరుతున్నారు. తన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విని, నిబంధనల ప్రకారం నిష్పక్షపాత విచారణ జరిపి న్యాయం చేయాలని వన్నారి పెరుమాళ్లు ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.