రసమే సాహిత్యానికి ప్రాణం.. మహిళా వర్సిటీ తెలుగు సాహితీ సమితిలో ఆచార్య పి.హరనాథ్
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి తెలుగు అధ్యయన శాఖ నిర్వహించిన తెలుగు సాహితీ సమితి ఘనంగా జరిగింది. సభాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతి మాట్లాడుతూ ఈ సాహితీ సమితిని గత 22 ఏళ్లుగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థినులు తమ విద్యార్థి దశలోనే సొంతంగా కార్యక్రమాన్ని తమ భుజాల మీద వేసుకొని బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని, విద్యార్థులే కార్యదర్శిగా ఉంటూ అధ్యక్షత వహిస్తూ నిర్వహించే ఈ కార్యక్రమం వారికి ఎన్నో అనుభవాలను నేర్పిస్తుందన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ‘ఆకాశవాణి’ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాహితీ సమితి సలహాదారు డా.సుభాషిణి మాట్లాడుతూ రస సిద్ధాంతం సాహిత్యంలోనే వినూత్నమైన, ప్రత్యేకమైన అంశమన్నారు. రసం అనేది సాహిత్యంలో కనిపించేది మాత్రమే కాదని, అది ప్రేక్షకుడి, పాఠకుడి మనసులో నిలిచిపోయే అంశమన్నారు. ఈ విధంగా సాహితీ సమితి నిర్వహించడం విద్యార్థులలో సాహిత్య అభివృద్ధిని పెంపొందించడానికి, పరిశోధన దృక్పథాన్ని, విమర్శనాత్మక దృష్టిని అలవరచడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈనాటి వక్త ఆచార్య పి.హరనాథ్ మాట్లాడుతూ, రసం మనసుకి సంబంధించిందన్నారు. మాట పుట్టడానికి ముందే మనసు పుట్టిందని, సృష్టి ప్రతి అణువులోనూ చైతన్యముందని గుర్తించిన మొట్టమొదటి వాడు భారతీయుడని గుర్తు చేశారు. మానవుని జీవితం మొత్తం రసంతోనే నిండి ఉంటుందని, మానవుడు అనునిత్యం రసాన్ని అనుభూతి చెందుతూనే ఉంటాడన్నారు. రసానుభవం ఎప్పుడూ ఆనందంతోనే నిండి ఉంటుందని, మానవుడు నవరసాల్లో ఏ రసాన్ని పొందినా చివరికి పొందేది ఆనందమేనని చెప్పారు. సూఫీఇజం గురించి మాట్లాడుతూ ‘నేను - నీవు’ అనే తత్వాన్ని వివరించారు. నవరసాల గురించి వివరిస్తూ వాటిని వర్గీకరించారు. విద్యార్థులు లక్ష్మీ ప్రసన్న, నందిని, వైష్ణవి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో డా.డి.యువ శ్రీ, డా.లక్ష్మీ ప్రియ, పరిశోధక విద్యార్థినులు, ఎం.ఏ విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్