రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : తాటిచెర్ల–గార్లదిన్నె రైల్వే స్టేషన్ల మధ్య బి. కొత్తపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు అనంతపురం రైల్వే పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం 9.25 గంటలకు ముందు చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి నంబర్ 61, కిలోమీటర్ నంబర్ 223/29-31 వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి సుమారు 45 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద తీవ్రతకు మృతుడి తల శరీరం నుంచి వేరుకావడంతో పాటు శరీరం పూర్తిగా నుజ్జునుజ్జయి గుర్తుపట్టలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. మృతుడు నలుపు, ఎరుపు రంగు గీతలున్న టీషర్టు, కాఫీ రంగు డ్రాయర్, కాఫీ రంగు ఫుల్ ప్యాంటు ధరించి ఉన్నట్లు వివరించారు.
మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్‌పీహెచ్‌సీ విజయ్ కుమార్‌ను 7989584613 నంబర్‌లో సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.