మరొకరి కళ్లలో వెలుగుగా మరణానంతరం కూడా మనం జీవించవచ్చు
ప్రొద్దుటూరు నవంబర్ 27 మేజర్ న్యూస్ :
మన మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియా అంథుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చని జన విజ్ఞాన వేదిక కడప జిల్లా అధ్యక్షులు పల్లవోలు రమణ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు పట్టణం గీతాశ్రమం వీధిలో వున్న మేడా. లక్ష్మిదేవమ్మ(80) శుక్రవారం తెల్లవారుజామున కాలధర్మం చెందారు. విషయం తెలుసుకున్న రమణ వారి కుటుంబ సబ్యులతో మాట్లాడి నేత్రదానంకు ఒప్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాద సమయంలోనూ ఆమె కుటుంబ సభ్యులు చూపిన ఔదార్యం, మానవత్వం ఎంతో అభినందనీయమన్నారు. తమ ప్రియమైన వ్యక్తి మరణించిన దుఃఖంలో కూడా, ఆమె నేత్రాలను కడప ఎల్.వి. ప్రసాద్ ఐబ్యాంక్‌కు దానం చేయడం ద్వారా చూపులేని వారికి చూపును అందించే మహోన్నత కార్యానికి కుటుంబ సభ్యులు సహకరించారని కొనియాడారు. వారి నిర్ణయం కేవలం ఒక కుటుంబం చేసిన దానం మాత్రమే కాదు… సమాజానికి అందించిన గొప్ప సందేశమని. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రపంచంలో ఎంతోమంది కార్నియా సమస్యల కారణంగా చూపును కోల్పోయి, చీకటి జీవితాన్ని గడుపుతున్నారని, మరణించిన వ్యక్తి నేత్రాలను సకాలంలో నేత్రబ్యాంకుకు అందించడం ద్వారా, అర్హులైన చూపులేని వారికి కార్నియా మార్పిడి చేసి చూపును తిరిగి పొందే అవకాశం కల్పించవచ్చని వివరించారు. నేత్రదానం ద్వారా మరణించిన వ్యక్తి మరొకరి జీవితంలో వెలుగుగా నిలుస్తారని. మనిషి మరణించినా, ఆయన చేసిన దానం మరొకరి జీవితంలో చిరకాలం జీవిస్తుందని వివరించారు. నేత్రదానానికి సహకరించిన ఆమె కుటుంబ సబ్యులు మేడా.నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి ప్రసన్న, జయంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. కడప ఎల్వీప్రసాద్ హాస్పిటల్ టెక్నీషియన్ ప్రశాంత్ కార్నియాలను సేకరించారు.