రాచర్ల పోలీస్ స్టేషన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా.
రాచర్ల ,మేజర్ న్యూస్.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేస్తూ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ పంకజ్ కుమార్ మీనా పోలీసు అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా ఎస్పీ రాచర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలు, పోలీస్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్నికలకు సంబంధించిన రికార్డులు మరియు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిని పరిశీలించారు.
* కమ్యూనికేషన్ వ్యవస్థను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ .
రాచర్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమాచారాన్ని చేరవేసే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా, జిల్లా కేంద్రం నుంచి అందే సమాచారాన్ని తక్షణమే స్వీకరించి స్పందించే విధానం ఎలా ఉందనే అంశాలను పరిశీలించారు.
అత్యవసర సమయాల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది జిల్లా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వేగంగా స్పందించాలని సూచించారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
పోలీస్ శాఖలో సమర్థవంతమైన సమాచార వ్యవస్థ శాంతిభద్రతల పరిరక్షణకు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన చర్యలకు కీలకమని ఎస్పీ పేర్కొన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్‌పై పూర్తి స్థాయి సమాచారాన్ని ముందుగానే సేకరించాలని ఎస్పీ సూచించారు. పోలింగ్ కేంద్రాల భవనం, ప్రవేశం–నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, టాయిలెట్లు, వాహనాల పార్కింగ్, భద్రతా పరంగా అనుకూలత వంటి అంశాలను పరిశీలించి పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.గత ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్లు లేదా గ్రామాల్లో జరిగిన ఘర్షణలు, కేసులు, వివాదాలు మరియు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ కు సూచించారు. గత ఎన్నికల అనుభవాలను విశ్లేషించి, సమస్యాత్మక గ్రామాలు మరియు పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులు, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైన చోట పి ఐ ఆర్ లు నమోదు చేసి తహసిల్దార్ వద్ద హాజరు పరచి బైండోవర్ చేయించండి , వారి ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న ఎన్ బి డబ్ల్యు ముద్దాయిల ఆచూకీని గుర్తించి, చట్టపరమైన ప్రక్రియను వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ కేసుల దర్యాప్తును సమీక్షిస్తూ, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి గ్రామానికి సంబంధించిన శాంతిభద్రతల పరిస్థితిపై కానిస్టేబుళ్ల సహకారంతో ముందస్తు సమాచారాన్ని నిరంతరం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లోని ముఖ్యమైన వ్యక్తులు, సున్నితమైన ప్రాంతాలు, పాత వివాదాలు, భూవివాదాలు, రాజకీయ పరమైన విభేదాలు తదితర అంశాలపై ముందస్తు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రివెంటివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్య ఏర్పడిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సమస్యను గుర్తించి నివారించే విధంగా పోలీసింగ్ ఉండాలని ఎస్పీ గారు స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశించారు.