ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసుల సన్నద్ధం
బందోబస్తుపై డీఎస్పీ శివప్రియ దిశానిర్దేశం.. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన
కడియం, మేజర్ న్యూస్ ,:కడియం మండలంలో గురువారం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మండలంలోని 22 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం. శివప్రియ, సీఐలు ఎ. వెంకటేశ్వరరావు, గణేష్ పోలీసు సిబ్బందికి ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, కడియంలోని జీఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద పోలీసు సిబ్బందికి కల్పించిన వసతులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇతర శాఖల సిబ్బందికి కళ్యాణ మండపం లోపల ఏర్పాట్లు చేయగా, పోలీసులకు మాత్రం బయట టెంట్ కేటాయించడంపై పలువురు సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. తుఫాను ప్రభావంతో వర్షపు జల్లులు కురుస్తున్న నేపథ్యంలో ఆరుబయట ఉండటం ఇబ్బందికరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ప్రశాంత ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే పోలీసు సిబ్బందికి కూడా ఇతర శాఖలతో సమానంగా తగిన వసతులు కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఎన్నికల బందోబస్తుకు సన్నద్ధమవుతున్న పోలీసులకు, మరోవైపు కనీస వసతుల అంశం చర్చనీయాంశంగా మారింది.