గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
సిద్దిపేట, : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారీలో భాగంగా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారీ, ఫారం-18 దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ కె. హైమావతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశించిన 15 రోజుల గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఎలక్టర్ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విద్యార్థులు, యువతకు ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
జిల్లాలో 6,898 ఫారం-18 దరఖాస్తులు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు మండలాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 6,898 ఫారం-18 దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 60 శాతానికి పైగా దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు.మిగిలిన దరఖాస్తులను కూడా సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించిన గడువులోగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు.